ఈ మెగా హీరో రేంజును ఆపడం కష్టమేనా?

154

మెగా కుటుంబం నుంచి తనదైన డ్యాన్సులతో, స్టైల్ తో అగ్ర హీరోగా ఎదిగిన నటుడు.. అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలపరంగా అంతకంతకూ ఎదుగుతున్నాడు.. ఈ హీరో. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మల్లువుడ్ (కేరళ చిత్ర పరిశ్రమ)లోనూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.. అల్లు అర్జున్. అక్కడ మనోడిని మల్లు అర్జున్ గా అభిమానులు పిలుచుకోవడం విశేషం. అంతేకాకుండా అక్కడ అగ్ర హీరోలకు ధీటుగా అల్లు అర్జున్ సినిమాలు కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ఈ రికార్డు మరే తెలుగు హీరోకి లేదు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ సత్తా కేవలం టాలీవుడ్, మల్లువుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ కూడా తెలుసుకుంటోంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులను గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ దక్కించుకుని సినిమాను యూట్యూబ్ లో పోస్టు చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో 200 మిలియన్ల మందికి పైగా చూడటం విశేషం. అంతేకాకుండా అత్యధిక లైకులు దక్కించుకున్న చిత్రంగానూ ఈ మెగా హీరో సినిమా సంచలనం సృష్టించింది.

తద్వారా యూట్యూబ్ లో అతి ఎక్కువ మంది చూసిన, అత్యధిక లైకులు తెచ్చుకున్న భారతీయ చిత్రంగా ‘సరైనోడు’ హిందీ వెర్షన్ రికార్డు సృష్టించింది. హిందీ, తమిళం, కన్నడం, మలయాళీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, భోజ్ పురి ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు తెరకెక్కుతుండగా అవేమీ రికార్డు దక్కించుకోకుండా ‘సరైనోడు’ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా సరైనోడులో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.