శ్రీదేవి కట్టుకున్న ఆఖరి పట్టు చీర.. డిజైన్‌ చేసిన ప్రాణ స్నేహితుడి మనోవేదన

372

అందాల తార… దివంగత నటి శ్రీదేవి.. తను నటించిన 300వ చిత్రం మామ్‌. అందులో అద్భుతమైన తన నటనకు మరణానంతరం జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అవార్డులు కొత్త కాదు.. ఆమె అందరికీ అందమైన గుర్తు. బతికి ఉన్నంత కాలం ఆమె కట్టు బొట్టు.. వేషధారణ స్పెషలాట్రక్షన్‌. అటు అందం.. ఇటు సంప్రదాయానికి శ్రీదేవి అసలు సిసలైన చిరునామా అనే చెప్పుకోవచ్చు. పార్టీలు, సినిమాలు.. ఎక్కడైనా ఆమె వేసుకున్న డ్రెస్‌లు అందరినీ ఆకర్షించేవి. ఇంతకీ ఆ దుస్తులన్నీ డిజైన్‌ చేసిందెవరనుకుంటున్నారు.. అతని పేరు మనీష్‌ మల్హోత్రా. ముంబాయిలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌. అంతకు మించి శ్రీదేవికి ప్రాణ స్నేహితుడు. పాపం.. ఆయనే శ్రీదేవి అంతిమ యాత్రకు ఆఖరి చీరను కూడా డిజైన్‌ చేసి ఇచ్చాడట.


ప్రతి రోజు ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. ఏ డ్రెస్‌ వేసుకోవాలి.. అంటూ శ్రీదేవి మనీష్‌కు ఫోన్‌ చేసేది. ఆయన చెప్పిన డిజైనే ఫైనల్‌. అదే డ్రెస్‌లో శ్రీదేవి తళుకులీనేదట. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. 28 ఏళ్లుగా ఈ బంధం కొనసాగింది. చివరకు చనిపోయే ముందు దుబాయిలో జరిగిన పెళ్లి వేడుకలోనూ శ్రీదేవి అందమైన గాగ్రా వేసుకుంది. డిజైనర్‌ మనీష్‌ కూడా పెళ్లిలో శ్రీదేవితో కలిసి సందడి చేశాడట. ఆ తర్వాత జరిగే ఈవెంట్‌కు శ్రీదేవి ఏం డ్రెస్‌ వేసుకోవాలి.. తను ఫోన్‌ చేసి ఏ డ్రెస్‌ వేసుకోవాలని అడిగితే.. ఏం చెప్పాలి.. అని మనీష్‌ ఎదురుచూస్తున్నాడు… ఇప్పటికీ ఆ ఫోన్‌ రాలేదు. ఎప్పుడు తన ఫోన్‌ వస్తుందా.. అని మనీష్‌ నిరీక్షిస్తూనే ఉన్నాడు. అసలు శ్రీదేవి మరణించిందనే విషయాన్ని నమ్మలేకపోయాడు. ఇంతలోనే శ్రీదేవి సోదరి శ్రీలత తన దగ్గరకు వచ్చి.. అంతిమ సంస్కారాలకు చీరను డిజైన్‌ చేయాలని.. ఓ సిల్క్‌ చీరను తెచ్చించింది. బతికి ఉన్నంత కాలం ఆమె దుస్తులను డిజైన్‌ చేసిన మనీష్‌.. తను కట్టుకున్న ఆఖరి చీరను కన్నీటితోనే డిజైన్‌ చేసి ఇచ్చేశాడట. శ్రీదేవి మరణించిన నెల రోజుల తర్వాత మనీష్‌ తన భావోద్వేగాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. చనిపోయే కొద్ది గంటల ముందు ఆమెతో ఫోన్లో మాట్లాడానని తన ప్రాణ స్నేహితురాలిని గుర్తుచేసుకున్నారు.


ఆ అందాల తారను గుర్తుచేసుకుంటూ తాజాగా మనీశ్‌ సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. ‘నాతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఓ స్నేహితురాలిని కోల్పోవడం ఇదే మొదటిసారి. ఆమె చనిపోయి నెల రోజులకుపైగా కావొస్తున్నా ఇప్పటికీ అబద్ధంగానే ఉంది. శ్రీదేవి నాకు 28 ఏళ్లుగా తెలుసు. ఇద్దరం కలిసి పెళ్లిలో సందడి చేశాం. అంతలోనే ఆమె అంతిమ సంస్కారాల కోసం తన సోదరి శ్రీలత నాకు సిల్క్‌ చీర ఇచ్చారు. షాకయ్యాను. శ్రీదేవి చనిపోయే కొన్ని గంటల ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడాను. జాన్వి తొలి సినిమా గురించే చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇప్పటికీ నాకు శ్రీదేవి ఫోన్‌ చేసి ఈవెంట్‌కి ఏ దుస్తులు వేసుకోవాలి? అని అడుగుతారేమోనని ఎదురుచూస్తున్నాను శ్రీదేవి ఎవరి గురించీ తప్పుగా మాట్లాడేవారు కాదు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె మరొకరి గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఎప్పుడూ దుస్తులు, ఆహారం, సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషిలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి కోసం గాగ్రా ఛోళీలు డిజైన్‌ చేసేవాడిని. ఇప్పుడు జాన్వి తొలి సినిమాకు దుస్తులు డిజైన్‌ చేస్తున్నా…’