ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

236

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పరిశోధనలు చేసిన వ్యక్తిగా హాకింగ్‌కి పేరుంది. ఐన్ స్టీన్ జయంతి రోజే స్టీఫెన్ హాకింగ్ మరణించడం యాధృచ్ఛికం. ఖగోళ శాస్త్రవేత్తగా కృష్ణ బిలాలు(‘బ్లాక్‌హోల్స్‌)పై అధ్యయనం చేశారు. ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ సహా, సైన్స్‌పై పలు పుస్తకాలు రాశారు.

మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధితో పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేశారు. దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.

1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ సమయంలోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

 జననం: 1942 జనవరి 8, ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో

చదువు: 1959లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్స్ చదివారు. తర్వాత కేంబ్రిడ్జ్‌లో పీహెచ్‌డీ చేశారు.
1963: మోటార్ న్యూరోన్ వ్యాధికి గురయ్యారు. కేవలం రెండేళ్లే బతుకుతారని చెప్పారు.
1974: కృష్ణబిలాలపై అధ్యయనం చేశారు.
1988: ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.
2014: హాకింగ్ జీవిత విశేషాలతో ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్ అనే సినిమా తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.