అరుదైన గౌరవం దక్కించుకున్న ఆ రెండు తెలుగు చిత్రాలేవో తెలుసా?

156

ఈ ఏడాది టాలీవుడ్‌లో సూపర్‌ హిట్లుగా నిలిచిన ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెల (ఆగస్టు) 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో జరగనున్న ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఈ రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. అవార్డుల కోసం పలు విభాగాల్లో ఈ రెండు చిత్రాలు నామినేషన్లు దక్కించుకున్నాయి.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. చిట్టిబాబుగా రామ్‌ ^è రణ్‌ నటన, రామలక్ష్మిగా సమంత క్యూట్‌ ఫెర్‌ఫార్మెన్స్, సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను పెద్ద హిట్‌ చేశాయి. ఇక అందాల తార కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘మహానటి’ కూడా సంచలన విజయం సాధించింది. అలనాటి మహానటి సావిత్రిగా కీర్తి అద్భుత నటన, సహాయక పాత్రల్లో దుల్కర్‌ సల్మాన్, సమంత, విజయ్‌ దేవరకొండ విరగదీశారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలను ఆగస్టులో జరిగే మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు నిర్వాహకులు ఎంపిక చేశారు. ఉత్తమ చిత్రాల కేటగిరీలో బాలీవుడ్‌ చిత్రాలు.. ప్యాడ్‌మ్యాన్, హిచికి, పద్మావత్, రాజి, సీక్రెట్‌ సూపర్‌స్టార్, సంజూ చిత్రాలతో మహానటి, రంగస్థలం పోటీపడుతున్నాయి. అదేవిధంగా ఉత్తమ నటి కేటగిరీలో బాలీవుడ్‌ భామలు.. రాణీ ముఖర్జీ, విద్యాబాలన్, దీపికా పదుకోణ్, అలియాభట్, జైరా వసీమ్‌ తదితరులతో కీర్తి సురేశ్‌ (మహానటి) పోటీపడుతోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి కేటగిరీలే కాకుండా బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌ కేటగిరీలో విక్కీ కౌశల్‌ (సంజూ), రణ్‌వీర్‌ షోరే (గాలి గులియాన్‌), ఫ్రీదా ఫ్రింటో (లవ్‌ సోనియా), రిచా చద్దా (లవ్‌ సోనియా)లతో అందాల తార సమంత (మహానటి) పోటీపడుతోంది. ఇలా రంగస్థలం, మహానటి చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో, మహానటి ఉత్తమ నటి కేటగిరీలో, ఉత్తమ సహాయ పాత్ర కేటగిరీలో బాలీవుడ్‌ మూవీస్‌తో పోటీపడుతున్నాయి.